Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు నియోజకవర్గంలో టిడిపి ఓట్ల తొలగింపునకు వైసిపి కుట్ర చనిపోయిన వ్యక్తులపేరుతో దరఖాస్తులు పెట్టిస్తారా? ఆత్మలు వచ్చి అప్లికేషన్లు పెట్టాయా ? దిగజారుడు రాజకీయాలు ఇకనైనా మానుకోండి వైసీపీ నేతలకు ఇంటూరి నాగేశ్వరరావు హెచ్చరిక కందుకూరు, అమరావతి జ్యోతి: ఓటర్ల జాబితాల విషయంలో, కందుకూరు నియోజకవర్గ వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కందుకూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు అధిక సంఖ్యలో తొలగించేందుకు వైసీపీ నేతలు కుట్రకు తెరతీసారని ఆరోపించారు. చనిపోయిన వారి పేరుతో పదుల సంఖ్యలో ఫారం -7 లు పెట్టారని చెబుతూ అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. కందుకూరు మండలంలోని పలుకూరు, కందుకూరు పట్టణంలోని 138వ నెంబర్ పోలింగ్ బూత్, గుడ్లూరు మండలం బసిరెడ్డిపాలెం, ఇంకా అనేక చోట్ల వైసీపీ నేతలు అప్లికేషన్లు పెట్టారని తెలిపారు. చనిపోయిన వారి పేర్ల మీద 45 ఓట్లు తొలగించడానికి దరఖాస్తులు పెట్టారన్నారు. ఆత్మలు కిందికి దిగివచ్చి ఈ అప్లికేషన్లు పెట్టాయా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. మరోవైపు బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించేందుకు కూడా వైసీపీ నేతలు ప్లాన్ చేశారని నాగేశ్వరరావు విమర్శించారు. కందుకూరు మండలంలోని కొండికందుకూరు, గుడ్లూరు మండలంలోని గుండ్లపాలెం, వలేటివారిపాలెం మండలంలోని బడేవారిపాలెం, పోలినేని పాలెం, లింగసముద్రం మండలంలోని మేదరమిట్లపాలెంతో సహా అనేక గ్రామాల్లో రాత్రికి రాత్రి వందల సంఖ్యలో ఫారం-7 లు పెట్టారని తెలిపారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న లోకల్ ఎమ్మెల్యే, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ తరపున కూడా ఫారం-7 లు అందజేశామని, అయితే డబల్ ఎంట్రీ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆధారాలు జతచేస్తూ దరఖాస్తులు పెట్టామన్నారు. అలా దరఖాస్తులు ఎందుకు పెట్టారంటూ, లింగసముద్రం మండలం మొగిలిచర్లలో టిడిపి నేతల ఇళ్లపైకి, అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి వెళ్లడం సరికాదని నాగేశ్వరావు అన్నారు. అధికారం ఉంది కదా అని, వైసీపీ నేతలు గుండా రాజకీయాలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. మరోవైపు కందుకూరు పట్టణంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాగేశ్వరరావు విమర్శించారు. కొన్ని రోజుల నుంచి తాను ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా, ప్రతిచోటా పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడాన్ని గమనించానన్నారు. ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు ఆ సమస్య పైన ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. ఫాగింగ్ చేయడానికి, బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. పట్టణ ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు, సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. ప్రజల సమస్యలు తీర్చలేని ఈ ప్రభుత్వానికి, నాలుగున్నర సంవత్సరాలుగా వార్డుల మొహం చూడని ఎమ్మెల్యే మహిధర్ రెడ్డికి, రాబోయే ఎన్నికల్లో ప్రజలకు గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని నాగేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధు, రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు నాదెళ్ల వెంకట సుబ్బారావు, పట్టణ ఉపాధ్యక్షుడు వడ్డెళ్ళ రవిచంద్ర తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi