Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తీరప్రాంత గ్రామాల్లో ఇంటూరి నాగేశ్వరరావు పర్యటన ఉలవపాడు,అమరావతి జ్యోతి: కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, మంగళవారం సాయంత్రం సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో పర్యటించారు. తుఫాను నేపథ్యంలో ఉలవపాడు మండలంలోని చాకిచెర్ల, చిన్నపట్టపుపాలెం, చిన్నపల్లెపాలెం గ్రామాల్లో ప్రజలను పరామర్శించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ముందుగా చాకిచెర్ల లోని తుఫాన్ షెల్టర్ లో ఆశ్రయం పొందుతున్న బాధితులతో నాగేశ్వరావు మాట్లాడారు. ప్రభుత్వం తరఫున వసతులు సరిగా అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. వారికి ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. అనంతరం చిన్నపట్టపుపాలెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు రోజులుగా తాగునీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలపడంతో, నాగేశ్వరరావు అక్కడ నుంచి తహసీల్దార్ తో మాట్లాడి గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. వర్షాలకు దెబ్బతిన్న వలలను ఆయన పరిశీలించారు. తమకు జీవనాధారమైన వలలు పూర్తిగా దెబ్బతిన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి సహాయం అందేలా కృషి చేస్తానని నాగేశ్వరరావు వారికి హామీ ఇచ్చారు.తరువాత చిన్నపల్లెపాలెం గ్రామంలోనూ ఆయన పర్యటించారు. ఈ రాత్రికి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలులు తగ్గేంత వరకు జాగ్రత్తగా ఉండాలని నాగేశ్వరరావు స్థానికులకు జాగ్రత్తలు చెప్పారు. ఏ అవసరం ఉన్నా తమ పార్టీ నాయకులకు సమాచారం ఇస్తే, సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.చాకిచెర్ల గ్రామ పార్టీ అధ్యక్షుడు మిరియం మల్లికార్జున, పార్టీ నాయకులు ఎందేటి శ్రీను, ఇతర నాయకులు నాగేశ్వరావు వెంట ఉన్నారు.
Admin
Amaravathi Jyothi